Luthra Brothers : గోవా నైట్‌క్లబ్ (Goa Nightclub) అగ్నిప్రమాదం (Fire accident) కేసులో నిందితులుగా ఉన్న లూత్రా బ్రదర్స్ (Luthra brothers) ను గోవా పోలీసులు (Goa police) అరెస్ట్ చేశారు. థాయ్‌లాండ్ (Thailand) నుంచి ఢిల్లీకి చేరుకున్న వారిని ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 6న నైట్‌క్లబ్‌లో ప్రమాదం జరగగానే ఆ క్లబ్ సహ యజమానులైన గౌరవ్ (Gaurav Luthra), సౌరభ్ లూత్రా (Saurabh Luthra) థాయ్‌లాండ్‌కు పారిపోయారు.
ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడంతో థాయ్‌లాండ్ పోలీసులు ఈ నెల 11న ఫుకెట్‌లో ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భారత అధికారుల అభ్యర్థన మేరకు ఇవాళ ఉదయం వారిని భారత్‌కు పంపించారు. ఇండిగో విమానంలో వచ్చిన ఇద్దరు నిందితులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగగానే గోవా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. శిక్షార్హమైన మారణహోమం, నిర్లక్ష్యం ఆరోపణలతో మరికాసేపట్లో పోలీసులు ఆ ఇద్దరినీ ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
ఆ తర్వాత ట్రాన్సిట్ రిమాండ్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేసి విచారణ నిమిత్తం గోవాకు తీసుకెళ్లనున్నారు. రేపు (బుధవారం) గోవాలోని కోర్టులో వారిని హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా ఈ నెల 6న గోవాలోని అర్పోరా ఏరియాలోగల ‘బిర్చ్ బై రోమియో లేన్ (Birch by Romeo Lane)’ నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.