Shamshabad Airport | న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకుంది. 2025 సంవత్సరానికి దక్షిణాసియా, భారత్‌లో అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది సేవ అవార్డును నాలుగోసారి దక్కించుకుంది. వాయు రవాణా రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్ ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌పోర్టులను ఎంపిక చేయగా దానిని స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పో 2025లో ప్రకటించి, అందజేశారు.
ఈ సందర్భంగా తమకు ఈ అవార్డు రావడం పట్ల జీఎంఆర్ యాజమాన్యం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేసింది. పౌరుల ప్రయాణం సాఫీగా, సౌకర్యవంతంగా సాగేలా విమానాశ్రయ సిబ్బంది చేసిన కృషిని ఈ అవార్డు ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ప్రయాణికుల సౌకర్యం కోసం విమానాశ్రయంలో అనేక కేంద్రీకృత ఆవిష్కరణలను అమలు చేసినట్టు తెలిపింది. నగరం వైపు చెక్-ఇన్, వేచి ఉండే సమయాన్ని తగ్గించే డిజిటల్ పరిష్కారాలు అమలు చేస్తున్నట్టు వివరించింది. సౌకర్యవంతమైన లాంజ్‌లు, విభిన్న భోజన, షాపింగ్ ఎంపికలు ఉన్నాయని తెలిపింది. ప్రత్యేక అవసరాల ప్రయాణికులకు సహాయం చేయడానికి శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నట్టు తెలిపింది.
2025 ఏడాదికి ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయంగా సింగపూర్ చాంగీ ఎయిర్‌పోర్టు మొదటి స్థానంలో, దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రెండో స్థానంలో నిలిచాయి. మొదటి 20 స్థానాలలో భారత్‌కు చోటు దక్కలేదు. అయితే దక్షిణాసియా, భారత్‌లో ఢిల్లీ విమానాశ్రయం అత్యుత్తమ ఎయిర్‌పోర్టు క్యాటగిరీలో టైటిల్ గెల్చుకుంది. దక్షిణాసియా, భారత్‌లో అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా బెంగళూరు, ఐదు మిలియన్ల లోపు ప్రయాణికుల క్యాటగిరీలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా గోవాలోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఎంపికైంది