(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘వికసిత్ భారత్’, ‘అచ్ఛేదిన్’ అంటూ ఊదరగొట్టే ప్రధాని మోదీ 11 ఏండ్ల హయాంలో పేదలకు ఒరిగిందేమీ లేదని మరోసారి రుజువైంది. కార్పొరేట్లకు కొమ్ముకాసే ఎన్డీయే ప్రభుత్వంలో మిలియనీర్లు బిలియనీర్లుగా మారుతుంటే, పేదలు మాత్రం నిరుపేదలుగానే మిగులుతున్నారు. ఆదాయ అసమానతల్లో భారత్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు బుధవారం విడుదలైన వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ (ప్రపంచ అసమానతల నివేదిక (ఆర్థిక))-2026లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్థిక అసమానతలు ఇలా..
దేశంలో ఆర్థిక అసమానతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజా నివేదిక ప్రకారం.. 10 శాతం మంది సంపన్నుల దగ్గర 65 శాతం సంపద మూలుగుతుండగా.. ఇందులో 1 శాతం మంది శ్రీమంతుల దగ్గర ఏకంగా 40 శాతం సంపద ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. జాతీయ ఆదాయంలో 57.7 శాతం వాటా కేవలం 10 శాతం మంది సంపన్నుల దగ్గరే పోగుపడిపోగా.. పేద, మధ్యతరగతికి చెందిన 50 శాతం మంది దగ్గర కేవలం 15 శాతం ఆదాయం మాత్రమే ఉన్నదని పేర్కొన్నది. పేదల తలసరి ఆదాయం సగటున రూ. 98 వేలుగా ఉంటే, కుబేరుల సగటు తలసరి ఆదాయం రూ.1.47 కోట్లుగా ఉన్నట్టు నివేదిక తేల్చి చెప్పింది.
11 ఏండ్లుగా ఏమీ మారలేదు
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 ఏండ్ల కాలంలో పేద, ధనిక వర్గాల మధ్య అంతరంలో ఏ మాత్రం మార్పు రాకపోగా, ఈ అంతరం స్వల్పంగా పెరిగినట్టు నివేదికలోని గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. పేద, ధనిక వర్గాల మధ్య ఆదాయ అసమానతలు 2014లో 38 శాతంగా ఉంటే, అది 2024 నాటికి 38.32 శాతంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యంలో కూడా ఏమాత్రం పెరుగుదల కనిపించ లేదని నివేదిక పేర్కొంది. 2014లో 15.7 శాతంగా ఉన్న మహిళా శ్రామికశక్తి, 2024 నాటికి కూడా 15.7 శాతంగానే ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
ఇక, ప్రపంచ జనాభాలో 50 శాతం మంది పేద, మధ్యతరగతి వద్ద ఉన్న సంపదతో పోలిస్తే.. మూడు రెట్లు ఎక్కువ సంపద కేవలం 60 వేల మంది మిలియనీర్ల దగ్గర (0.001 శాతం) ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. మొత్తంగా 90 శాతం మంది పేద, మధ్యతరగతి వర్గాల దగ్గర ఉన్న మొత్తం సంపదతో పోలిస్తే.. మరింత ఎక్కువ సంపదను 1 శాతం మంది బిలియనీర్లు కలిగి ఉన్నారని నివేదిక వివరించింది. ఆదాయ అసమానతలు సమ్మిళితాభివృద్ధికి ఆటంకమేనని ఆందోళన వ్యక్తం చేసింది.
వారానికి నలుగురు కొత్త కోటీశ్వరులు
2024లో ప్రపంచవ్యాప్తంగా వారానికి సగటున నలుగురు బిలియనీర్లు పుట్టుకొచ్చారని ఆక్స్ఫామ్ ఇటీవల వెల్లడించింది. 1765 నుంచి 1900 మధ్య సాగిన వలసవాదంలో భారత్ నుంచి బ్రిటన్కు చేరిన సంపద విలువ ఇప్పుడు 64.82 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఇందులో సగం ధనం 10% మంది అక్కడి శ్రీమంతుల దగ్గరే పోగుపడిపోయినట్టు పేర్కొంది. బ్రిటిష్ 50 పౌండ్ల నోట్లతో ఈ డబ్బునంతటినీ లండన్వ్యాప్తంగా నాలుగు కంటే ఎక్కువ సార్లు కార్పెట్గా పరుచవచ్చని చెప్పింది.
