షోలాపూర్,జనవరి 10 (నమస్తే తెలంగాణ): హిజాబ్ ధరించిన మహిళ భారత్లో ఏదో రోజు ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత రాజ్యాంగంలోని సమ్మిళిత స్ఫూర్తిని ఆయన నొక్కి చెబుతూ హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అయ్యే రోజు గురించి తాను కలలు గంటున్నానని అన్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో శనివారం జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మతంతో సంబంధం లేకుండా భారత పౌరులెవరైనా దేశంలో అత్యున్నత పదవులను అధిష్ఠించవచ్చునని పేర్కొందని, దీనికి విరుద్ధంగా పాకిస్థాన్లో అన్య మతస్థులు ఉన్నత రాజకీయ పదవులను అధిష్ఠించడాన్ని ఆ దేశ రాజ్యాంగం నిషేధించిందని తెలిపారు. కాగా, యూపీఏహయాంలో ఉపా చట్టం లో అప్పటి హోం మంత్రి చిదంబరం చేసిన సవరణల కారణంగా పలువురు అండర్ ట్రయల్ ఖైదీలు జైళ్లలో మగ్గిపోతున్నారని విమర్శించారు. ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షేజాద్ మాట్లాడు తూ హిజాబ్ ధరించే ముస్లిం మహిళలకు ఒవైసీ తన పార్టీలో ఉన్నత పదవులు ఇవ్వాలని సూచించారు.