భోపాల్: ఒక బాలికను యువకుడు మభ్యపెట్టి కిడ్నాప్ చేశాడు. తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను హత్య చేసి మృతదేహానికి నిప్పంటించి తగులబెట్టారు. (Girl Gang-Raped, Murdered) దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 28న 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. రాము గుర్జర్ అనే యువకుడు ఆమెను మభ్యపెట్టి తీసుకెళ్లినట్లు ఆమె కుటుంబానికి తెలిసింది. దీంతో ఆ బాలిక కోసం అన్నిచోట్ల వెతికారు. ఫలితం లేకపోవడంతో మౌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాగా, కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాము గుర్జర్‌ను అరెస్ట్ చేశారు. అతడ్ని ప్రశ్నించగా ఆ బాలికను ప్రలోభపెట్టి గ్వాలియర్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు. గుప్తేశ్వర్ కొండపై ఉన్న నవగ్రహ ఆలయం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో తన ఇద్దరు సహచరులైన అరుణ్ కుష్వా, గౌరవ్ కుష్వాలతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పాడు.
మరోవైపు ఎవరికైనా చెబుతుందన్న భయంతో మే 29న ఆ బాలికను హత్య చేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులకు రాము తెలిపాడు. ఈ నేపథ్యంలో మిగతా నిందితులైన అరుణ్, గౌరవ్‌ను గ్వాలియర్‌లో అరెస్ట్ చేశారు. గుప్తేశ్వర్ కొండ ప్రాంతంలో కాలిన బాలిక అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం తర్వాత ఆమె కుటుంబానికి అప్పగించారు.
అయితే ఈ సంఘటనపై బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహించారు. మంగళవారం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ముగ్గురు నిందితులకు తక్షణమే మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీస్ అధికారి హామీ ఇచ్చారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.