పుణె: బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కారులో కూర్చొన్న 17 ఏండ్ల బాలికను బయటకు లాగి లైంగిక దాడికి పాల్పడటమే కాక, అందులోని ముగ్గురు మహిళల నుంచి బంగారాన్ని దోచుకున్న ఘటన మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జరిగింది. ఈ ఘటన దాండ్ ప్రాంతంలోని భిగ్వాన్ హైవేపై సోమవారం చోటుచేసుకుంది. ఆ సమయంలో 70 ఏండ్ల వృద్ధ డ్రైవర్, ముగ్గురు మహిళలు, 17 ఏండ్ల ఇద్దరు బాలురు, 17 ఏండ్ల బాలిక సహా మొత్తం ఏడుగురు కారులో ఉన్నారు.
జున్నార్ తెహ్సిల్ గ్రామంలో రెండు కుటుంబాలకు చెందిన వీరు సోలాపూర్ జిల్లాలో ఉన్న పండర్పూర్ దేవాలయానికి వెళ్తున్నారు. దారిలో ఒక టీ స్టాల్ వద్ద కారు ఆగినప్పుడు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వారిని ఆయుధాలతో బెదిరించి, వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరించారు. తర్వాత ఒక నిందితుడు కారులోని బాలికను బయటకు లాగి దూరంగా తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత వారు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు ఎనిమిది బృందాలను రంగంలోకి దింపినట్టు పుణె (గ్రామీణ) ఎస్పీ సందీప్ సింగ్ గిల్ చెప్పారు.