Tamil Nadu : తమిళనాడు (Tamil Nadu) లో దారుణం జరిగింది. లైంగిక దాడికి గురైన మూడేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తిరువళ్లూర్ (Thiruvallur) లో జరిగిన అమానవీయ ఘటనపై తీగ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో తిరువళ్లూర్ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియా (Industrial Area) లో నివసిస్తున్న బీహార్ వలస కూలీని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికకు నిందితుడు ముందే తెలిసి ఉండటంతో బిస్కెట్లు (Biscuits) ఇస్తానని ఆశ చూపడంతో అతడి వెంట వెళ్లిపోయిందని ప్రాథమికంగా గుర్తించారు.
ఆ తర్వాత ఆ బాలిక ఒక పొద దగ్గర తీవ్ర గాయాలతో కనిపించిందని స్థానికులు చెప్పారు. తర్వాత అతడిని పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉందన్న అనుమానంతో స్థానికులు మరికొందరిపైనా దాడిచేశారు. ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారం జరగలేదని, ఒకరి ప్రమేయం మాత్రమే ఉందని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోవడంతో హత్య అభియోగాలు మోపనున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఉత్తరభారతంలో ఎక్కడో జరుగుతాయని భావించే నేరాలు ఇప్పుడు టీవీకే పాలనలో నిత్యకృత్యంగా మారాయని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మహిళలు, చిన్నారులను కాపాడటంలో సీఎం విజయ్ విఫలమవుతున్నారని ఆరోపించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజలను సమీకరించి రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టేందుకు డీఎంకే ఏమాత్రం వెనకాడదని హెచ్చరించారు. ఇటీవల తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ పరిధిలో 14 ఏళ్ల బాలికను అపహరించిన ఓ కారు డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది.