బెంగళూరు: ఏడు నెలల కిందట ఒక యువతి అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. చివరకు ఆధార్ ఓటీపీ ఆధారంగా ఆ యువతి ఆచూకీని గుర్తించారు. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని గర్భవతి అయిన ఆమెను చివరకు తల్లిదండ్రులకు అప్పగించారు. (Missing Girl Traced By Aadhaar OTP) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. విద్యారణ్యపురం ప్రాంతంలో నివసిస్తున్న 18 ఏళ్ల యువతి ఈ ఏడాది జనవరి 31న అదృశ్యమైంది. కాలేజీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన ఆమె, తన మైనర్ స్నేహితురాలితో కలిసి బయటకు వెళ్లింది. వారిద్దరూ తమ ఆధార్ కార్డులు, కాలేజీ బ్యాగులు తప్ప, మొబైల్ ఫోన్లు లేదా ఇతర వస్తువులేవీ వెంట తీసుకెళ్లలేదు. మలె మహాదేశ్వర హిల్స్ వరకు కలిసి ప్రయాణించిన ఆ ఇద్దరు బాలికలు ఆ తర్వాత వేర్వేరుగా వెళ్లిపోయారు.
కాగా, ఇద్దరు బాలికల మిస్సింగ్‌పై వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి పేరెంట్స్ కర్ణాటక హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్‌లో ఈ కేసుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది.
మరోవైపు ఆ యువతి తన ఆధార్ వివరాల కోసం ఒక మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ పొందినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. ఆ మొబైల్ నంబర్‌ను సంప్రదించగా ఆ వ్యక్తి ఆమె భర్త అని తెలుసుకున్నారు. అతడి సమాచారం ద్వారా ఆ యువతి ఆచూకీని గుర్తించారు. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని గర్భందాల్చిన ఆ యువతిని హైకోర్టులో హాజరుపరిచి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అదృశ్యమైన మరో మైనర్ బాలిక ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.