న్యూఢిల్లీ, డిసెంబర్ 30 : జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన గిగ్ వర్కర్లు డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా సమ్మె తలపెట్టడంతో దేశంలో నూతన సంవత్సర వేడుకలకు భారీ అవరోధం ఏర్పడే అవకాశం ఉంది. రిటైల్ మార్కెట్లు అంచనా వేసుకున్న ఏడాది ముగింపు రెవెన్యూ టార్గెట్లపై గిగ్ వర్కర్ల సమ్మె తీవ్ర ప్రభావం చూపనున్నది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సమ్మెకు పిలుపునివ్వగా మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ-ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వ్యాప్తంగా మద్దతు లభించింది.
భారతదేశ డిజిటల్ కామర్స్ వ్యవస్థకు వెన్నెముకగా అభివర్ణించే డెలివరీ పార్ట్నర్లకు స్వల్ప ఆదాయానికి, తక్కువ భద్రత, గౌరవం, ఉద్యోగ భద్రతతో పనిచేయాల్సి వస్తోందని సంబంధిత యూనియన్లు వాపోతున్నాయి. గిగ్ వర్కర్ల సమ్మె కారణంగా హైదరాబాద్, బెంగళూరు, పుణె, ఢిల్లీ, కోల్‌కతా, పలు టైర్-2 మార్కెట్లలో కస్టమర్లకు ఫుడ్ ఆర్డర్లు, నిత్యావసర వస్తువుల డెలివరీల ఆర్డర్లు క్యాన్సిల్ కావడం లేదా తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది.