శ్రీనగర్: గులాం నబీ ఆజాద్ అనంత్‌నాగ్-రాజౌరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ఆయన పార్టీ డీపీఏపీ తెలిపింది. ఆజాద్ 2022లో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. తర్వాత డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) పేరుతో సొంత పార్టీ స్థాపించారు.
పార్టీ అధినేత ఆజాద్ అనంత్‌నాగ్ రాజౌరి నుంచి పోటీ చేయాలని కోర్ కమిటీ సమావేశం నిర్ణయించిందని డీపీఏపీ నేత తాజ్ మొహియుద్దీన్ మంగళవారం తెలిపారు. 2014లో ఉధంపూర్ నుంచి బీజేపీ చేతిలో ఓడిన తర్వాత ఆజాద్‌కు ఇవే తొలి లోక్‌సభ ఎన్నికలు. 1980, 1984లో మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి ఆజాద్ రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990-2006 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. 2006-08 మధ్య జమ్ముకశ్మీర్ సీఎంగా కొనసాగారు. 2009-2021 ఫిబ్రవరి వరకు మళ్లీ పెద్దల సభలోనే కొనసాగారు.