న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్న జమ్ముకశ్మీర్ సీనియర్ పొలిటీషియన్ గులాంనబీ ఆజాద్ మళ్లీ పాతగూటికే చేరనున్నారా..? ఈ మేరకు ఆజాద్‌తో కాంగ్రెస్ పార్టీ మంతనాలు జరుపుతున్నదా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. కాంగ్రెస్, ఆజాద్ వర్గాల మధ్య చర్చల ప్రక్రియ కొనసాగుతున్నదని టాక్ నడుస్తున్నది.
గులాంనబీ ఆజాద్ ఈ ఏడాది ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్టోబర్‌లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో గులాంనబీ మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరనున్నాడనే ప్రచారం జరుగుతున్నది.
పార్టీకి ఆజాద్‌పై, ఆజాద్‌కు పార్టీపై తగ్గని ప్రేమ
ఇటీవల గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ.. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదు అని వ్యాఖ్యానించారు. అంటే పార్టీని బలహీనపరుస్తున్న అంశాలపైనే తప్ప, కాంగ్రెస్ సిద్ధాంతాలపై ఆయనకు ఎలాంటి వ్యతిరేక లేదని ఆజాద్ చెప్పకనే చెప్పారు.
ఆ తర్వాత కొన్ని రోజులకు కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర కన్వీనర్ దిగ్విజయ్ సింగ్.. రాహుల్ యాత్రలో పాల్గొనాలంలూ గులాంనబీ ఆజాద్‌కు బహిరంగ ఆహ్వానం పలికారు. అంతకుముందే కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్.. గులాంనబీ ఆజాద్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని కోరారు.
ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గులాంనబీ ఆజాద్‌కు గానీ, గులాంనబీ ఆజాద్‌కు కాంగ్రెస్ పార్టీపైగానీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదని అర్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలలోపు ఆజాద్ తిరిగి పాతగూటికే చేరనున్నాడనే ప్రచారం జోరందుకున్నది. పార్టీని వీడి వెళ్లేటప్పుడు ఆజాద్ తన రాజీనామా లేఖలో తీవ్ర విమర్శలు చేశారు.
రాజీనామా లేఖలో రాహుల్‌పై విమర్శనాస్త్రాలు
ముఖ్యంగా పార్టీ నిర్ణయాల్లో రాహుల్‌గాంధీ మితిమీరిన జోక్యంపై ఆజాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సోనియాగాంధీ నామమాత్రపు అధ్యక్షురాలిగా ఉంటున్నారని, రాహుల్‌గాంధీ కోటరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని తన రాజీనామా లేఖలో ఆజాద్ పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్ మాత్రం ఆజాద్‌ను తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నది.
అందుకోసం గాంధీల కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రురాలైన అంబికా సోనిని కూడా రంగంలోకి దించింది. ఎందుకంటే అంబికాసోనీకి గులాంనబీ ఆజాద్‌తో కూడా దశాబ్దాలుగా మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అంబికాసోని.. ఆజాద్‌ను కలిసి మాట్లాడినట్టు తెలిసింది. ముందుగా భారత్ జోడో యాత్రకు వచ్చి రాహుల్‌గాంధీ మాట్లాడాలని, ఆ తర్వాత పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకోవచ్చని ఆమె సూచించినట్లు సమాచారం.
ఆజాద్ మనసులో ఏముందో..
అయితే, కాంగ్రెస్ పార్టీ ముప్పేట ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ ఆజాద్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన స్పందన రాలేదు. దాంతో ఆజాద్‌ను మళ్లీ చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నా.. ఆజాద్ తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తారా.. లేదా.. అనే విషయంలో స్పష్టత కరువైంది. ఏం జరుగనుంది అనే దానిపై కశ్మీర్లోకి రాహుల్ పాదయాత్ర చేరిన తర్వాత స్పష్టమయ్యే ఛాన్స్ ఉన్నది.