లక్నో: సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులున్న వ్యక్తి, అతడి కుమారుడి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగ్వాదం జరుగడంతో ఆ కుమారుడు తన తండ్రిపై పిస్టల్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. (Man Shot Dead By Son) ఉత్తరప్రదేశలోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మోదీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుదానా గ్రామానికి చెందిన 52 ఏళ్ల హరిఓమ్ చౌదరి ఆ ప్రాంతంలో సంపన్న రైతు. మోదీనగర్‌లో సుమారు 50 ఎకరాల వ్యవసాయ భూమి, ఢిల్లీ-మీరట్ రోడ్డులో మార్కెట్ ఆయనకు ఉన్నాయి. ఆ ఆస్తుల విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని అంచనా.
కాగా, హరిఓమ్ చౌదరికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. 32 ఏళ్ల పెద్ద కుమారుడు నిఖిల్‌కు మార్కెట్లోని షాపులు, సుమారు 15 ఎకరాల భూమి ఇచ్చాడు. అయితే మద్యానికి బానిసైన పెద్ద కుమారుడు మిగిలిన భూమి కూడా తన పేరు మీద బదిలీ చేయాలని తండ్రితో గొడవపడేవాడు. అయితే మద్యం, ఇతర వ్యసనాలకు కుమారుడు బానిస కావడంతో ఆయన నిరాకరించారు.
మరోవైపు బుధవారం రాత్రి హరిఓమ్ చౌదరి తన భార్య, చిన్న కొడుకు నీషుతో కలిసి భోజనం చేశారు. పెద్ద కొడుకు నిఖిల్ మద్యం మత్తులో ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు. మద్యం సేవించినందుకు తండ్రి మందలించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో నిఖిల్ పిస్టల్ బయటకు తీసి తన తండ్రి ముఖం, ఛాతి, పొట్టపై కాల్పులు జరిపాడు. హరిఓమ్ కుప్పకూలి మరణించగా కుమారుడు అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం హరిఓమ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన శరీరంపై 6 తూటాల గాయాలున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నట్లు వివరించారు. 2018లో కూడా వాగ్వాదం నేపథ్యంలో తమ్ముడు నీషుపై నిఖిల్ కాల్పులు జరిపినట్లు తెలిసిందని, ఆ కేసుపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.