e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home Top Slides థర్డ్‌వేవ్‌కు సిద్ధం

థర్డ్‌వేవ్‌కు సిద్ధం

థర్డ్‌వేవ్‌కు సిద్ధం
  • కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు చర్యలు
  • జిల్లాస్థాయిలో పర్యవేక్షణకు కేంద్ర నిపుణుల బృందం
  • త్రిముఖ వ్యూహంతో మహారాష్ట్ర, టాస్క్‌ఫోర్స్‌తో ఢిల్లీ
  • అదేబాటలో కర్ణాటక, గోవా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌
  • పిల్లల రక్షణకు కేర్‌ సెంటర్లు, పునరావాస కేంద్రాలు
  • అక్టోబర్‌ నాటికి మూడోవేవ్‌: నిపుణులు

ప్రస్తుతం దేశాన్ని సెకండ్‌వేవ్‌ (రెండోదశ ఉద్ధృతి) కకావికలం చేస్తున్నది. ఈ దశను ముందే కచ్చితంగా అంచనా వేయగలిగి ఉంటే సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉండేదన్న భావన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతున్నది. రానున్న కాలంలో మూడోవేవ్‌ ముప్పు పొంచి ఉందన్న శాస్త్రవేత్తల హెచ్చరికలతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ వేవ్‌లో ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ప్రభావానికి లోనయ్యే ప్రమాదమున్నదన్న వార్తల నేపథ్యంలో కట్టుదిట్టమైన ప్రణాళికలు అమలు చేస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో మూడో దశ ఉద్ధృతి అనివార్యమేనని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల స్పష్టం చేసింది. సెకండ్‌వేవ్‌ నుంచి పాఠాలను నేర్చుకొని మూడో దశను ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని పేర్కొంది. వైరస్‌లో మార్పులు, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటున్న మ్యుటేషన్లపై సమర్థంగా పనిచేసేలా వ్యాక్సిన్ల ఫార్ములాలో అప్‌డేట్లు తీసుకురావడం అవసరమని నొక్కి చెప్పింది. రాష్ర్టాలు, ఉన్నత విభాగాలు, వైద్యులు సమన్వయంతో మహమ్మారిని జయించాలని ఉద్ఘాటించింది. కేసులు ఎక్కువగా ఉన్న 10 రాష్ర్టాల్లోని ప్రభావిత జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి, పిల్లల్లో నమోదవుతున్న కేసుల సమాచారాన్ని కేంద్రం గురువారం ప్రత్యేకంగా సేకరించింది. కేసుల సరళిలో గణనీయమైన మార్పులు కనబడితే వెంటనే సమాచారమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. యువత, పిల్లల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉన్న జిల్లాలపై ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓ నిపుణుల బృందం పర్యవేక్షస్తున్నది. మరోవైపు, థర్డ్‌వేవ్‌లో కరోనాతో పోరాడటానికి ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు బఫర్‌ స్టాక్‌ను సిద్ధం చేసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.

రాష్ర్టాలు ఇలా సంసిద్ధం

మూడోవేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి రాష్ర్టాలూ సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర త్రిముఖ వ్యూహాన్ని సిద్ధం చేసింది. వైద్య వ్యవస్థ బలోపేతం-కఠినంగా కొవిడ్‌ నిబంధనల అమలు-పరిశ్రమల కార్యకలాపాలకు అడ్డంకులు లేకుండా చూడటం వంటి మూడు సూత్రాలను ప్రధానంగా తీసుకొచ్చింది. అలాగే ముంబైలో చిన్నారుల కోసం కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసినట్టు బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ చిల్డ్రన్‌ ప్రొటెక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. పిల్లల్లో ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మహమ్మారి ముప్పు నుంచి పిల్లలను రక్షించి, యుద్ధప్రాతిపదికన సేవలు అందించేందుకు ఢిల్లీ సర్కార్‌ ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పిడియాట్రిక్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్లను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల కోసం పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. 15 మంది సభ్యులతో ప్రత్యేక కార్యదళాన్ని గోవా ప్రభుత్వం సిద్ధం చేసింది. యూపీ, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

మూడోవేవ్‌ అప్పుడే?

సెప్టెంబర్‌-అక్టోబర్‌ నాటికి మూడోవేవ్‌ విరుచుకుపడే ప్రమాదమున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆలోగా పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని, కొవిడ్‌-19 నిబంధనలే చిన్నా వారికి రక్షణ అని పేర్కొంటున్నారు. మరోవైపు, పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపబోతున్న మూడోవేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ర్టాలు సిద్ధంగా ఉండాలని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ విజ్ఞప్తి చేసింది. దేశంలో అందుబాటులో ఉన్న పిడియాట్రిక్‌ కేంద్రాలు, దవాఖానల్లో పిల్లల పడకలు, నియోనాటల్‌ అంబులెన్స్‌లు వంటి వివరాలు ఇవ్వాలని కోరింది.

ఇప్పటివరకూ కొవిడ్‌బారిన పడ్డ పిల్లలు, యువత ఎందరంటే?

వయసు కేసులు శాతం
0-10 8,66,187 3.33
11-20 21,69,922 8.35
21-30 56,62,508 21.79
మొత్తం కేసులు 2,65,30,132
ఆధారం: ఐసీఎంఆర్‌ మే-23, 2021

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
థర్డ్‌వేవ్‌కు సిద్ధం

ట్రెండింగ్‌

Advertisement