న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) సుదూర ఆలోచనగా భావిస్తున్న వారికి ఇది చేదువార్త. 2025లో ఏఐ పనితీరును చూశామని, రానున్న కాలంలో ఇది మరిన్ని రంగాల్లో తన ప్రతిభా పాటవాలను చూపగలదని ఏఐ గాడ్‌ఫాదర్‌గా పిలిచే జెఫ్రీ హింటన్ తెలిపారు. ఏఐ వేగాన్ని బట్టి 2026 తొలి నాళ్లలోనే నిరుద్యోగ బూమ్‌కు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
వైట్-కాలర్ ఉద్యోగాల్లో పెను మార్పులు
రానున్న కాలంలో ముఖ్యంగా వైట్-కాలర్ ఉద్యోగాల్లో పెను మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని జెఫ్రీ చెప్పారు. ఆలోచన, రచన, విశ్లేషణ లేదా నిర్ణయాత్మక అధికారంపై ఆధారపడిన ఉద్యోగాలు ఇప్పటికే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం మెదడు చేసే పనిని ఏఐ చేయడం మొదలుపెట్టింది. ఈ మార్పుకు నిరుద్యోగిత భారీ పెరుగుదలకు దారితీయగలదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉత్పాదకత పెరిగి వ్యాపారాభివృద్ధి జరగవచ్చేమో కాని కొత్త ఉద్యోగాల కల్పన జరగకపోవచ్చని వారు భావిస్తున్నారు.
కరోనా కల్లోల తర్వాత తమ వ్యాపారాలను విస్తరించిన చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకునేందుకే ఆసక్తి చూపుతున్నాయని, దీనికి ప్రధాన కారణం ఏఐయేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే అన్ని రంగాల్లో పూర్తిగా ఉపాధి కోల్పోయే ప్రమాదం లేదని, ఏఐ అభివృద్ధితోపాటు ఏఐ వ్యవస్థలను పర్యవేక్షించే, నిర్వహించే ఇంజినీరింగ్, నాయకత్వ పాత్రల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వారు చెప్పారు.
మోసకారి ఏఐ!
ఉద్యోగాల సంగతి అటుంచితే అంతకన్నా భారీ ముప్పే పొంచి ఉందని హింటన్ కంపెనీలను హెచ్చరిస్తున్నారు. శక్తివంతమైన ఏఐ ఎలా మోసగించాలో కూడా నేర్చుకుంటుందని, లాభాల వేటలో పరుగెత్తే కంపెనీలు రక్షణ నిబంధనలను విస్మరించే అవకాశం ఉందని చెప్పారు.