న్యూఢిల్లీ, డిసెంబర్ 30: వచ్చే ఏడాది నుంచి ఎస్బీఐ కార్డ్ కస్టమర్లకు లాంజ్ అనుమతికి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. తరచూ విమాన ప్రయాణాలు చేసేవారికి విమానాశ్రయాల్లో ఉన్న రద్దీని తప్పించుకొనేందుకు ఎయిర్పోర్ట్ లాంజ్‌లు ఎంతో దోహదం చేస్తాయన్న విషయం తెలిసిందే. కాగా, జనవరి 10 నుంచి తమ కస్టమర్ల వద్దనున్న క్రెడిట్ కార్డు రకాన్నిబట్టి లాంజ్ అనుమతులు, వివిధ చార్జీలు ఆధారపడి ఉంటాయని ఎస్బీఐ కార్డ్స్ చెప్తున్నది. వీసా/రూపే కార్డుదారులకు ప్రవేశ రుసుము తప్పనిసరిగా రూ.2 (నాన్-రిఫండబుల్) ఉంటుంది. అలాగే మాస్టర్‌కార్డ్ కోసం రూ.25 (తాత్కాలికం) ఉంటుంది. ఇక మీ కార్డు పరిశీలనకు లాంజ్ పీవోఎస్ల వద్దే ఈ ఫీజుల్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే లాంజ్‌లను సెట్ ఏ, బీగా వర్గీకరించారు. సెట్ ఏలో ప్రీమియం ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులుంటే.. సెట్ బీలో ప్రైమ్, ప్లాటినమ్ ఎస్బీఐ కార్డుదారులున్నారు.
ఇదీ సంగతి..
అపోలో ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్, బీపీసీఎల్ ఎస్బీఐ కార్డ్ ఆక్టేన్, క్లబ్ విస్తారా ఎస్బీఐ కార్డ్, లాండ్మార్క్ రివార్డ్స్ ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్, పేటీఎం ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్, ఫోన్‌పే ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ వంటి ప్రీమియం ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు హైదరాబాద్ సహా ఆయా ప్రధాన నగరాల్లోని ఎయిర్‌పోర్టుల్లో దేశీయ, అంతర్జాతీయ లాంజ్ సౌకర్యాలుంటాయి. అలాగే ప్రైమ్, ప్రైమ్ ప్రో, టైటాన్, క్రిస్ైప్లెయర్, భాగస్వామ్య బ్యాంకులతో కలిసి జారీచేసే మల్టిపుల్ కో-బ్రాండెడ్ ప్రైమ్, ప్లాటినమ్ ఎస్బీఐ కార్డుదారులకు దేశంలోని ఆయా నగరాల ఎయిర్పోర్ట్ లాంజ్‌లను వినియోగించుకునే వీలుంటుంది. మరిన్ని వివరాలకు ఎస్బీఐ కార్డ్స్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఇక కార్డు రకాన్నిబట్టి కాంప్లిమెంటరీ విజిట్లు ఉంటాయి. ఈ కోటా పూర్తయితే ప్రవేశానికి వీలుండదు. లేదా నిర్ణీత లాంజ్ రేట్లు వర్తిస్తాయి. అలాగే భోజనాలు, పానీయాలు (ప్రత్యేకంగా ఆల్కహాల్), నాప్ రూమ్స్, స్పా, మసాజ్ సర్వీసులు, కాంప్లిమెంటరీ పరిమితుల్ని దాటి జరిగే వినియోగాలకు లాంజ్ పాలసీనిబట్టి చార్జీలుంటాయి. సౌకర్యాలు, వసతుల ఆధారంగా లాంజ్ వార్షిక ఫీజులు రూ.1,499గా, రూ.2,999గా ఉన్నాయి.