న్యూఢిల్లీ : వడోదర కేంద్రంగా గతి శక్తి విశ్వవిద్యాలయం ఏర్పాటుకానున్నది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు వడోదర కేంద్రంగా ఉన్న నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ యూనివర్శిటీని గతి శక్తి విశ్వవిద్యాలయ పేరుతో సెంట్రల్ వర్శిటీగా మార్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
ఈ చట్టంలోని మొదటి షెడ్యూల్లో పేర్కొన్న విధంగా గతి శక్తి విశ్వవిద్యాలయం టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ మన దేశం మొత్తానికి విస్తరించారు. ఈ విశ్వవిద్యాలయానికి రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చనున్నది. వడోదరలోని నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్స్టిట్యూట్కి చెందిన, అన్ని స్థిర, అస్థిర ఆస్తులు ఈ చట్టం క్రింద స్థాపితమైన గతి శక్తి విశ్వవిద్యాలయం పరిధిలో ఉంటాయి. అలాగే, ఇన్స్టిట్యూట్ అన్ని హక్కులు, బాధ్యతలను కూడా ఈ చట్టం ప్రకారం గతి శక్తి విశ్వవిద్యాలయానికి బదిలీ అవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నది.
మల్టీ-మోడల్ కనెక్టివిటీ కోసం కేంద్రం ప్రతిష్టాత్మకంగా రూ.100 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ పేరుతో ఈ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నది. రవాణా, సాంకేతికత, నిర్వహణకు సంబంధించిన వివిధ విభాగాలలో ఉన్నత నాణ్యత బోధన, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి ఈ విశ్వవిద్యాలయం చర్యలు తీసుకోనున్నది. రానున్న రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో కూడా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది.