ముంబై: ఎరువుల కర్మాగారంలో రియాక్టర్ పేలింది. దీంతో గ్యాస్ లీక్ అయ్యింది. (Gas Leak) విష వాయువుల వల్ల ముగ్గురు మరణించారు. మరో 9 మంది అస్వస్థత చెందారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో షాల్గావ్ ఎంఐడీసీలోని మయన్మార్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. రసాయన పొగలు వెలువడ్డాయి. దీంతో కార్మికులు భయంతో పరుగులుతీశారు.
కాగా, విష వాయువులు పీల్చి 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక సెక్యూరిటీ గార్డు మరణించారు. చనిపోయిన మహిళలను సాంగ్లీ జిల్లాలోని యెత్గావ్కు చెందిన సుచితా ఉథాలే (50), సతారా జిల్లా మసూర్కు చెందిన నీలం రెత్రేకర్ (26)గా పోలీసులు గుర్తించారు. అస్వస్థతకు గురైన మరో 9 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.