Gangster Chhota Rajan : ఒకప్పుడు దావూద్ ఇబ్రహీంకు పోటీగా అండర్‌వరల్డ్ డాన్‌గా పేరొందిన చోటా రాజన్ (Chhota Rajan) కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2001లో హోటల్ యజమాని జయాశెట్టి హత్య కేసులో చోటా రాజన్ దోషిగా తేలడంతో జీవిత ఖైదు పడింది. అప్పటి నుంచి ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా ఆ శిక్షను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ చోటారాజన్‌కు బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ కోసం పూచీకత్తు కింద రూ.లక్ష బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే రాజన్‌పై ఉన్న ఇతర క్రిమినల్ కేసులవల్ల ఆయన ప్రస్తుతం జైల్లోనే ఉంటారని పేర్కొంది. కాగా ఇదే కేసులో నిందితుడిగా ఉండి దాదాపు 20 సంవత్సరాలుగా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ ప్రసాద్ పూజారిని ఈ ఏడాది మార్చిలో ముంబై క్రైం పోలీసులు ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. చైనా నుంచి దిల్లీకి అక్కడినుంచి ముంబైకి తీసుకొచ్చి అరెస్టు చేశారు.
2001 మే 4న సెంట్రల్ ముంబైలోని గామ్దేవి ప్రాంతంలో ఉన్న ‘గోల్డెన్ క్రౌన్’ హోటల్ యజమాని జయాశెట్టిని కొందరు దుండగులు కాల్చిచంపారు. హోటల్ మొదటి అంతస్తులో ఈ హత్య జరిగింది. చోటా రాజన్ గ్యాంగ్ సభ్యుడు హేమంత్ పూజారి డబ్బులు ఇవ్వాలని జయాశెట్టిని బెదిరించాడు. డబ్బులు ఇచ్చేందుకు తను నిరాకరించడంతో ఆయనను హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో చోటా రాజన్‌తోపాటు మరికొందరిని కూడా దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఈ క్రమంలో తన శిక్షను సస్పెండ్ చేసి, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చోటా రాజన్ బాంబే హైకోర్టులో అప్పీలు చేశారు. దాంతో ఆ పిటిషన్‌పై విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ జే డే హత్య కేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్న రాజన్ ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నాడు. కాబట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో ఆయన జైల్లో ఉండక తప్పని పరిస్థితి నెలకొంది.