భువనేశ్వర్: లైంగిక దాడి బాధితురాలు వైద్య పరీక్షల కోసం12 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. అంతేగాక పోలీసులు ఆమెను రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు తిప్పారు. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 37 ఏళ్ల మహిళ ఈ నెల 18న కజిన్‌తో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తున్నది. మార్గమధ్యలో ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. మహిళ వెంట ఉన్న వ్యక్తిని కొట్టారు. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
కాగా, బాధితురాలు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం ఉదయం 9 గంటలకు పోలీసులు ఆ మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు చేయలేదు. నేరం జరిగిన ప్రాంతంలోని ఆరోగ్య కేంద్రానికి బాధితురాలిని తీసుకెళ్లాలని పోలీసులకు చెప్పారు.
మరోవైపు పోలీసులు ఆ మహిళను తమ వాహనంలో మరో ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ మహిళా వైద్యురాలు లేకపోవడంతో వైద్య పరీక్షలు నిర్వహించలేదు. దీంతో బాధిత మహిళ పలు గంటలపాటు పోలీస్ వ్యాన్లోనే కూర్చొని ఉంది. పోలీసులు ఆమెను మళ్లీ తొలుత తీసుకెళ్లిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చివరకు అక్కడ రాత్రి 9.30 గంటలకు ఆమెకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. పూర్తి వైద్య పరీక్షల కోసం శుక్రవారం తిరిగి రావాలని ఆమెకు చెప్పారు. చివరకు శుక్రవారం పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేశారు.
కాగా, లైంగిక దాడి బాధితురాలికి వైద్య పరీక్షల ఆలస్యంలో తమ తప్పేమి లేదని పోలీస్ అధికారి తెలిపారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు తాను సెలవులో ఉన్నానని, వైద్య పరీక్షల జాప్యం గురించి ఏమీ తెలియదని కియోంజర్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. మిగతా సీనియర్ వైద్యాధికారులు కూడా దీనిపై స్పందించలేదు.