గువాహటి, ఆగస్టు 23: దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా అస్సాంలోని నాగావ్ జిల్లా దింగ్ ప్రాంతంలో 14 ఏండ్ల బాలిక సామూహిక లైంగిక దాడికి గురైంది. బాలిక ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా అడ్డగించిన ముగ్గురు వ్యక్తులు ఈ దురాగతానికి ఒడిగట్టారని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. గ్యాంగ్ రేప్ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక సైకిల్‌పై ఇంటికి వస్తుండగా, బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలై, అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రోడ్డు పక్కన ఒక కుంట సమీపంలో వదిలేసి వెళ్లారు. అనంతరం బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలిని నాగావ్‌లోని ఓ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని, మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హిమంత బిశ్వ చెప్పారు.