గాంధీజీ మోకాళ్ల మీదకు ఎగగట్టిన పంచె మాత్రమే ధరించేవారు. సదరు ఆహార్యాన్ని ఉద్దేశించి బ్రిటిష్ నాయకుడు చర్చిల్ ‘హాఫ్ నేక్డ్ ఫకీర్’ (అర్ధనగ్న ఫకీర్) అని గాంధీజీని తూలనాడడం అందరికీ తెలిసిందే. తర్వాతి కాలంలో గాంధీజీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు లండన్ వెళ్లినప్పుడు అక్కడి మీడియా ఆ మాటను పదేపదే వల్లించింది.
గాంధీజీ నిరాడంబరమైన దుస్తులను ఉద్దేశించి ‘ఇలాగే వెళ్లి రాజుగారిని కలుస్తారా?’ అని ఓ విలేకరి అడిగాడు. దానికాయన తడుముకోకుండా ‘ఏంచేస్తాం.. మా ఇద్దరికి అవసరమైన దుస్తులు రాజుగారు ఒక్కరే కట్టుకున్నారు’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారట. బ్రిటిష్ రాజు ఒంటి నిండా దిట్టంగా దుస్తులు ధరిస్తారు మరి.