ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ పరిసరాల్లో ఒక సొరంగం బయటపడింది. అసెంబ్లీ నుంచి ఎర్రకోట వరకూ ఆ సొరంగం ద్వారా ప్రయాణించొచ్చు. ఇప్పుడు అదే భవనంలో మరో రహస్య గది బయటపడింది. ఇక్కడ మరణశిక్షలు అమలు చేయడానికి ఉపయోగించే ‘గాలోస్’ ఉన్నాయి. ఈ భవనం, సొరంగం రెంటినీ బ్రిటీషు కాలంలో ఏర్పాటు చేశారని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ చెప్పారు.
ఈ భవనం 1913 నుంచి 1926 మధ్య లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉండేది. ఆ తర్వాత ఈ భవనాన్ని బ్రిటిష్ పాలకులు న్యాయస్థానంగా మార్చేశారని గోయల్ వివరించారు. ఇక్కడ విప్లవకారులపై విచారణ జరిగేదని చెప్పారు. ‘ఎర్రకోట నుంచి సొరంగ మార్గం ద్వారా విప్లవ కారులను ఇక్కడకు తీసుకొచ్చేవారు. విచారణ తర్వాత ఖైదీలను హాల్లోనే కట్టేసేవాళ్లు. మరణశిక్ష పడితే ఇప్పుడు బయటపడిన గదిలో వారికి శిక్ష అమలు చేసేవాళ్లు’ అని రామ్ నివాస్ గోయల్ తెలిపారు.
ఒక వర్కర్ ఈ భవనంలోని గోడల్లో ఒకటి కొంచెం కొత్తగా ఉండటాన్ని గుర్తించాడని, పరిశీలించి చూస్తే గోడ వెనుక డొల్లగా ఉన్నట్లు తెలిసిందని ఆయన చెప్పారు. దీంతో ఆ గోడను పడగొట్టామన్నారు. ఆర్కియాలజీ శాఖకు చెందిన బృందాన్ని పిలిపించి ఇక్కడి ఇటుకలు, కలప, ఇతర వస్తువులు ఏ కాలం నాటివో తెలుసుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ భవనానికి మరమ్మతులు చేసి, అసెంబ్లీ సెషన్స్ లేని సమయంలో టూరిస్టులకు అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు.