న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌కు జీ20 (G20 summit) బాసటగా నిలిచింది. ఆ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా బలవంతంగా ఉక్రెయిన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రపంచ దేశాల అధినేతలు వ్యతిరేకించారు. అలాగే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడాన్ని ఖండించారు. ఐక్యరాజ్యసమతి జనరల్ అసెంబ్లీ, యూఎన్ భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాలను పునరుద్ఘాటించారు. యూఎన్ చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని నొక్కి చెప్పారు. అయితే రష్యా పేరును నేరుగా ప్రస్తావించకుండా ఈ మేరకు రూపొందించిన ‘ఢిల్లీ డిక్లరేషన్’పై జీ20 దేశాల ప్రతినిధులు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. చివరకు ‘ఢిల్లీ డిక్లరేషన్’కు తమ సమ్మతిని తెలియజేశారు.
కాగా, అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 ప్రధాన వేదిక అని ‘ఢిల్లీ డిక్లరేషన్’లో పేర్కొన్నారు. అయితే భౌగోళిక, రాజకీయ, భద్రతా సమస్యలను పరిష్కరించడానికి వేదిక కానప్పటికీ, ఈ సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.