Maharashtra | ముంబై, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి కూటమి’లో లుకలుకలు తీవ్రమయ్యాయి. బీజేపీ, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌షిండే నేతృత్వంలోని శివసేన మధ్య విభేదాలు నెలకొన్నాయన్న చర్చ నడుస్తున్నది. కూటమి నుంచి షిండేను బయటకు పంపే ప్రయత్నం జరుగుతున్నదని సమాచారం. తమను పొమ్మనలేక పొగ బెడతున్నారని షిండే వర్గం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. త్వరలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.
ఈ క్రమంలో షిండే సొంత జిల్లా థాణేలో పాగా వేసేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్‌ను జిల్లాకు పంపింది. ఆయన థాణేలో జనతా దర్బార్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇది షిండే వర్గానికి రుచించడం లేదు. థాణేలో గణేశ్ నాయక్ ప్రవేశం.. షిండేను కట్టడి చేయడానికేనని భావిస్తున్నారు. ఈ క్రమంలో తాము కూడా నవీ ముంబైలో జనతా దర్బార్ నిర్వహిస్తామని షిండే గ్రూపు నేతలు ప్రకటించారు.