FSSAI Warn | ప్రోటోకాల్స్ పాటించని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల 70 మంది ప్రతినిధులతో ఎఫ్ఎస్ఎస్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమావేశం అనంతరం ఈ హెచ్చరికలు చేసింది. ఆహార భద్రతా ప్రోటోకాల్‌లను పాటించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని.. అలాంటి సందర్భాల్లో కఠిన చర్యలుంటాయని సీఈవో జీ కమల వర్ధనరావు ఈ కామర్స్ కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఈ-కామర్స్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మార్కెట్లో ఆహార భద్రత ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
ఈ విషయంలో వినియోగదారులకు ఇచ్చే ప్రతీ రీసిప్ట్, ఇన్వాయిస్, నగదు మెమోపై ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ నంబర్లు తప్పనిసరిగా ప్రముఖంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. FOSCOS పోర్టల్‌లో సంస్థలకు సంబంధించిన అన్ని గోడౌన్స్, స్టోరేజ్ సెంటర్ల వివరాలు ఇవ్వాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ కామర్స్ సంస్థలను కోరింది. వినియోగదారు ఇంటర్ఫేస్లో ఆహార ఉత్పత్తుల గడువు తేదీ, వినియోగ తేదీలను ప్రదర్శించే అవకాశాలపై సైతం సమావేశంలో చర్చించారు. వేర్‌హౌస్, స్టోరేజ్ సెంటర్లలో తప్పనిసరిగా పరిశుభ్రత, ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఖచ్చితంగా పాటించాలని కమల వర్ధనరావు స్పష్టం చేశారు. అలాగే, ఈ-కామర్స్ కార్యకలాపాలతో అనుసంధానించిన అన్ని వేర్‌హౌస్‌ల వివరాలు ఎఫ్ఎస్ఎస్ఏఐలో నమోదు చేయబడాల్సిందేనని.. తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని సూచించారు.