కోల్‌కతా: భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నాణ్యతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 23న వారణాసి-న్యూఢిల్లీ మార్గంలోని వందే భారత్ రైలు లోని సీ7 కోచ్‌లో ప్రయాణించిన వారికి చేదు అనుభవం ఎదురైంది. ప్రయాణ సమయంలో హఠాత్తుగా పైకప్పు నుంచి నీళ్లు కారడం ప్రారంభం కావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ‘నా టాబ్లెట్, ట్రౌజర్స్ తడిచిపోయాయి. ఇతర ప్రయాణికులూ తడిసి ముద్దయ్యారు. 8 గంటల పాటు ఆ కష్టం తప్పలేదు. చివరికి రైలు సిబ్బంది నా బెర్త్ దగ్గర ఉన్న ఏసీని ఆఫ్ చేశారు. తేమ వాతావరణంలో అసౌకర్యమైన ప్రయాణాన్ని నేను, నా సహ ప్రయాణికులు అలాగే కొనసాగించాల్సి వచ్చింది’ అని దర్శిల్ మిశ్రా అనే విద్యార్థి వాపోయారు. సమస్యను రైల్వే భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకెళితే అతడు సర్దుకుపొమ్మని చెప్పారని అన్నారు.
టికెట్ ఎగ్జామినర్ ప్రయాణ సమయంలో తమ కోచ్‌కు రానే రాలేదని తెలిపారు. తనకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని వినియోగదారుల ఫోరంలో దర్శిల్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు వందే భారత్ కీర్తిని తక్కువ చేస్తూ వాటి నిర్వహణలో ఉన్న తీవ్రమైన లోపాలను వెల్లడిస్తాయని చెప్పారు. ఈ ఘటనపై రైల్వే సేవ ఎక్స్‌లో స్పందించింది. ఏసీలోని నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఎయిర్ ఫిల్టర్ వద్ద రంధ్రాలు బ్లాక్ కావడం వల్ల కూలింగ్ కాయిల్ వద్ద నీరు పేరుకుపోయి, ఎయిర్ డక్ట్‌లోకి తిరిగి ప్రవేశించడం వల్ల ప్రయాణికులుండే ప్రాంతంలో నీళ్లు కారాయని తెలిపింది. రైలు తిరుగు ప్రయాణ సమయానికి సమస్యను పరిష్కరించామని చెప్పింది.