West Bengal : రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు ఉండాల్సిందే అనుకుంటారు చాలా మంది. కానీ, ఈ అభిప్రాయం తప్పని నిరూపించింది ఒక పేద మహిళ. కొద్దిరోజుల క్రితం వరకు ఇళ్లల్లో పని మనిషిగా చేసిన మహిళ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. భారీ మెజారిటీతో బీజేపీ తరఫున గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది. అధికార టీఎంసీ అభ్యర్థిని ఓడించి చరిత్ర సృష్టించింది. ఇదంతా జరిగింది పశ్చిమ బెంగాల్లో. ఆమె పేరు కలితా మాఝీ. ఈమె తాజాగా ఔస్గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
బెంగాల్లోని గుస్కారా మున్సిపాలిటీకి చెందిన కలితా మాఝీ.. స్థానికుల ఇళ్లల్లో పని మనిషిగా చేసేది. నాలుగైదు ఇళ్లల్లో పని చేస్తూ నెలకు రూ.2,500 నుంచి రూ.4,000 వరకు సంపాదించేది. ఆమె భర్త ఒక పైప్ మెకానిక్. వీరికి ఎనిమిదో తరగతి చదివే బాబు ఉన్నాడు. కలితాకు రాజకీయాలంటే ఆసక్తి. ఈ ఇష్టంతోనే ఈమె 2021లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అయితే, అప్పట్లో టీఎంసీ అభ్యర్థి అబేధానంద తాండర్ చేతిలో దాదాపు 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ, తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమెకు మరోసారి ఔస్గ్రామ్ బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో రెండోసారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమెకు మద్దతుగా ప్రధాని మోదీ కూడా ప్రచారం నిర్వహించారు. ఆమె పేద, బలహీన వర్గాలకు ప్రతీక అని ప్రచారం సందర్భంగా మోదీ అన్నారు.
దీంతో కలితాకు మంచి ప్రచారం లభించింది. ఈ ఎన్నికల్లో ఆమె టీఎంసీ అభ్యర్థి శ్యామ ప్రసన్న లోహార్పై 12,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ఆమెకు 1,07,692 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలకు ముందు ఒక పనిమనిషిగా చేసిన సాధారణ మహిళ.. ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఒక సంచలనమే. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో అధికార పార్టీ విజయంలో కలిత కూడా భాగస్వామిగా ఉన్నారు. మరో రెండు రోజుల్లో బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 294 సీట్లకుగాను, 206 సీట్లు సాధించింది.