న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా గాలి కాలుష్యం తీవ్రత పెరుగుతోంది. పంజాబ్‌లో రైతులు తమ పొలాల్లోని కొయ్య కాలును తగులబెడుతుండటం కూడా ఢిల్లీ, దాని పరిసరాల్లో కాలుష్య పెరగడానికి కారణమవుతున్నది. ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యం, ప్రజారోగ్యంపై దాని దుష్ప్రభావం గురించి మేదాంత హాస్పిటల్‌కు చెందిన సీనియర్ లంగ్ స్పెషలిస్ట్ అర్వింద్ కుమార్ వెల్లడించారు.
మానవ శరీరంలో కాలి వేలు మొదలు తల వరకు గాలి కాలుష్యం కారణంగా ప్రభావితం కాని అవయవమే ఉండదని డాక్టర్ అర్వింద్ కుమార్ చెప్పారు. ఎయిర్ పొల్యూషన్ బాడీలోని ప్రతి పార్ట్‌ను అనారోగ్యం పాలయ్యేలా చేస్తుందని ఆయన తెలిపారు. వాయు కాలుష్యం వల్ల మనుషులు ముందుగా స్థూల కాయం బారిన పడుతారని అది క్రమంగా ఆస్తమాకు దారి తీస్తుందని తెలిపారు. వాయు కాలుష్యం ఊబకాయానికి కారణమవుతుందనడానికి ఇప్పుడు ఎన్నో రుజువులు ఉన్నాయని డాక్టర్ చెప్పారు.
వాతావరణం కలుషితమైన ప్రాంతాల్లో నివసించే వారిలో చాలా మంది ఈ రెండు సమస్యల బారిన పడుతున్నారని డాక్టర్ అర్వింద్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న వారి ఆరోగ్యం మరింత రిస్క్‌లో పడుతుందన్నారు. ఢిల్లీలోని 1100 మంది చిన్నారులపై తమ అధ్యయనం చేశామని, వారిలో ప్రతి ముగ్గురిలో ఒక్కరు ఆస్తమా, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.
ఈ వాయు కాలుష్యం అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతుందని డాక్టర్ అర్వింద్ చెప్పారు. తల్లి గర్భంలో ఉన్న బిడ్డలపై ఈ వాయు కాలుష్యం ప్రభావం ఉంటుందన్నారు. తల్లి తీసుకునే శ్వాస ద్వారా గాల్లోని విషాలు బిడ్డ రక్తంలో చేరతాయని చెప్పారు. ఢిల్లీలో AQI 450-500 ఉందంటే రోజుకు 25 నుంచి 30 సిగరెట్లు తాగిన దాంతో సమానమని ఆయన తెలిపారు. దాంతో రకరకాల శ్వాస సమస్యలు వస్తాయని అన్నారు.