పాట్నా, జూలై 5: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ మళ్లీ తెరపైకి వచ్చారు. దాదాపు మూడేండ్ల తర్వాత సోమవారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆర్జేడీ రజతోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు. నీరసంగా కనిపించిన లాలూ ఇదివరకటిలా మాటాల తూటాలు పేల్చలేదు. అక్కడక్కడ ఉచ్చారణలో స్పష్టత కొరవడింది. అయితే తాను కోలుకుని బీహార్ వస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. కేంద్రంలో మోదీ సర్కారు, బీహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలో సామాజిక సామరస్యతకు ముప్పు ఏర్పడిందని అన్నారు. నితీశ్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని, రాష్ట్రంలో రోజూ నాలుగు హత్యలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. తన కొడుకు తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఆర్జీడీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. గత ఎన్నికల్లో అంత బాగా పార్టీని నడిపిస్తాడని ఊహించలేదని కొనియాడారు.