న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరో ఎన్నికల హామీ ప్రకటించారు. ఢిల్లీలో నివసించే అద్దెదారులకు విద్యుత్, తాగు నీరు ఉచితంగా అందిస్తామని తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ‘మేం ఢిల్లీ నివాసితులకు ఉచిత విద్యుత్, ఉచిత తాగు నీరు అందించాం. అయితే అద్దెదారులకు ఈ ప్రయోజనాలు లభించకపోవడం దురదృష్టకరం. ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం ఏర్పడితే, అద్దెదారులకు కూడా ఉచిత విద్యుత్, తాగు నీరు అందించే వ్యవస్థను ప్రవేశపెడతాం’ అని అన్నారు.
కాగా, ఢిల్లీలో నివసిస్తున్న చాలా మంది అద్దెదారులు పూర్వాంచల్‌కు చెందినవారని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వారిలో చాలా మంది చాలా పేదవారని చెప్పారు. వారు ఎలాంటి సబ్సిడీలు పొందలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనిని పరిష్కరించడానికి తాము ప్రయత్నిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఢిల్లీలోని ఇంటి అద్దెదారులకు కూడా ఉచిత విద్యుత్, ఉచిత తాగు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావాలని ఆప్ ఆశిస్తున్నది.