చెన్నై, మార్చి 24: వచ్చే నెలలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విపక్ష ఏఐఏడీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసి ఓటర్లపై వరాలు జల్లు కురిపించించింది. 2026లో తాము అధికారంలోకి వస్తే అన్ని బియ్యం క్యాటగిరీ రేషన్‌కార్డు దారులకు ఒక రిఫ్రిజిరేటర్‌ను ఉచితంగా అందజేస్తామని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి ప్రకటించారు. మహిళల మాదిరిగానే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని హామీనిచ్చారు. అంతేకాకుండా రేషన్‌కార్డుదారులకు ఒక కిలో పప్పు, ఒక లీటర్ వంటనూనె ఉచితంగా ఇస్తామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న పన్నులు, ధరల పెరుగుదలను తట్టుకునేందుకు ప్రతి కుటుంబానికీ 10,000 నగదును ఏడాదికి ఒకసారి అందజేస్తామని, రూ. 25 వేల రాయితీతో 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు అందిస్తామని తెలిపారు. అలాగే ప్రతి ఏడాదీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని, జల్లికట్టులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని, బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యా రుణాలు మాఫీ చేస్తామని, సామాజిక భద్రతా పింఛన్‌ను రూ.2 వేలకు పెంచుతామని ఏఐఏడీఎంకే తన మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
ఎన్నికల్లో పోటీ చేయం: కమల్ హాసన్
వచ్చే నెల 23న జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎంఎన్ఎం పోటీ చేయదని, అయితే డీఎంకే నేతృత్వంలోని కూటమికి తమ పార్టీ బేషరతు మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు, ఎంపీ కమల్ హాసన్ ప్రకటించారు. డీఎంకే ప్రతిపాదించిన సీట్ల సంఖ్య, అలాగే ఎంఎన్ఎం అభ్యర్థులు ఉదయించే సూర్యుడు గుర్తు కింద పోటీ చేయాలన్న సూచన ఆమోదయోగ్యం కాదని అన్నారు. రాజకీయాల్లో ఎన్నికలు ఒక భాగమే తప్ప, అదే సర్వస్వం కాదని, రాజకీయాలకు ఫుల్స్టాప్ ఉండదని అన్నారు.