Ramavath Sunil Naik | కొచ్చి: పంజాబ్ మహిళ ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌కు చెందిన రమావత్ సునీల్ నాయక్ (26)ను కేరళ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్ నాయక్ ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకలో లెఫ్టినెంట్‌గా పని చేస్తున్నారు. సిమ్లాలో పని చేస్తున్న ఫిర్యాదుదారును రమావత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నారు. ఆయన పిలుపు మేరకు ఆమె కొచ్చి నగరానికి వచ్చారు.
కడవంతరలో ఓ హోటల్లో ఆమెకు ఉద్యోగం దొరికింది. అనంతరం వీరిద్దరూ కలిసి ఒకే అద్దె ఇంట్లో నివసించారు. పెండ్లి చేసుకుంటానని చెప్పి, ఆమెతో సునీల్ నాయక్ శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి పెండ్లి చేసుకోమని ఆమె పట్టుబట్టేసరికి ఆమెపై సునీల్ నాయక్ భౌతిక దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.