Foxconn | తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫాక్స్‌కాన్ భారత్‌లో సమీకండక్టర్ తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ కోసం ప్రత్యేకంగా దరఖాస్తును దాఖలు చేయనున్నది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం వెల్లడించింది. సెమీకండక్టర్లకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌పై పని చేస్తున్నామని, డిస్ప్లే ఫ్యాబ్ ఎకోసిస్టమ్ కోసం దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రకటనలో పేర్కొంది. ఇందు కోసం మరింత అనుకూలమైన భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు తెలిపింది.
ఇంతకు ముందు అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత లిమిటెడ్‌తో కలిసి 19.5 బిలియన్ డాలర్ల జాయింట్ వెంచర్‌ను ఫాక్స్‌కాన్ రద్దు చేసుకున్నది. రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్లో సెమీకండక్టర్లు, డిస్ప్లే తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు గతేడాది హాన్ హై టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) భాగస్వామ్యంతో వేదాంత గ్రూప్ ఒప్పందంపై సంతకాలు చేసింది. అయితే ఈ జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్‌కాన్ పేరు తొలగించేందుకు కసరత్తు చేస్తున్నామని, ఆ వెంచర్ పూర్తిగా వేదాంతకు చెందిందిందేనని ఫాక్స్‌కాన్ సోమవారం ప్రకటించింది.