చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుధునగర్ జిల్లాలోని సట్టూర్ సమీపంలోగల ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పటాకుల తయారీకి కెమికల్స్‌ను మిక్స్ చేస్తుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది. ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు సంభవించినప్పుడు ఆ ఫ్యాక్టరీలో మొత్తం 15 మంది పనిచేస్తున్నట్లు తెలిసింది.
ఘటనపై సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కాగా, ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున, క్షతగాత్రుల కుటుంబాలకు ఒక్కో లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.