పుణె: అది భవన నిర్మాణానికి సంబంధించిన కరెంటు సామానుతోపాటు, హార్డ్వేర్ వస్తువులను అమ్మే దుకాణం. ఉన్నట్టుండి బుధవారం ఉదయం ఆ దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు మరింత పెరిగి అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న నలుగురు సజీవ దహనమయ్యారు. మహారాష్ట్రలోని పుణె జిల్లా పింప్రి-చించ్వాడ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఉన్న ఆ దుకాణంలోంచి మంటలు చెలరేగగానే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. ప్రమాదంలో దుకాణంలోని వస్తువులు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి.