Manipur : నిరంతరం హింసతో ఆందోళనకరంగా ఉండే మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటన జరిగింది. ఒక వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసి, నలుగురిని హతమార్చారు. మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటన మణిపూర్‌లోని కాంగ్గోక్పి జిల్లాలో, మకుయి అషాంగ్-తబాంబా నాగా ప్రాంతాల మధ్య గురువారం జరిగింది. ఇది నాగా పౌరులు ఎక్కువగా ఉండే ప్రాంతం.
ఈ ఘటనకు సంబంధించి సాయుధులైన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో వెళ్తున్న ఒక వాహనంపై దాడి చేశారు. వాహనంలో ఉన్న లియాంగ్మై నాగ తెగకు చెందిన నలుగురు పౌరులను హతమార్చారు. మరొకరిని తమ వెంట తీసుకుని వెళ్లారు. అతడి గురించిన సమాచారం ఏమీ తెలియరాలేదు. ఈ ఘటన గురంచి సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. నలుగురి మృతదేహాల్ని సేనాపతి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కనిపించకుండా పోయిన ఒక్కరి కోసం, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నాగా తెగ పౌరుల నుంచి ఉద్రిక్తత తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్థానిక నాగ తెగ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి నిరసనగా స్తానికంగా ఉన్న అన్ని షాపులు, వ్యాపార సంస్తల్ని మూసివేశారు. ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు నాగా పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఎన్పీవో) బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ దాడికి గల కారణాలు.. దాడి చేసింది ఎవరు అనే అంశాలు తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.