ORS Liquid | విరేచనాలు వచ్చినప్పుడు శరీరంలో నీరు, లవణాలు వేగంగా తగ్గిపోవడంతో డీహైడ్రేషన్ ముప్పు ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు నోటి ద్వారా తీసుకునే రీహైడ్రేషన్ ద్రావణం (ఓఆర్ఎస్) ఎంతో ప్రభావవంతమైన, తక్కువ ఖర్చుతో లభించే చికిత్సగా ఉపయోగపడుతుంది. అయితే ఓఆర్ఎస్ ఇచ్చామని చెబుతున్నప్పటికీ కొందరి ఆరోగ్యం ఎందుకు మెరుగుపడడం లేదన్నది వైద్యులు తరచూ ఎదుర్కొనే ప్రశ్న. చాలా సందర్భాల్లో సమస్య ఓఆర్ఎస్లో కాకుండా దాన్ని సరైన పద్ధతిలో తయారు చేయకపోవడం, తీసుకోకపోవడం లేదా నిల్వ చేయడంలోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓఆర్ఎస్ సాధారణ నీరు లేదా ఉప్పు, చక్కెర కలిపిన పానీయం కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఓఆర్ఎస్లో గ్లూకోజ్, అవసరమైన ఎలక్ట్రోలైట్లు కచ్చితమైన నిష్పత్తిలో ఉంటాయి. చిన్నపేగులో సోడియం, గ్లూకోజ్ కలిసి శోషణకు గురయ్యే సహజ ప్రక్రియను ఇది ఉపయోగించుకుంటుంది. దాంతో విరేచనాల సమయంలో శరీరం కోల్పోయిన నీరు, లవణాలు సమర్థవంతంగా తిరిగి శరీరంలోకి చేరుతాయి. ఇందులోని పదార్థాల సమతుల్యతను మార్చితే ద్రావణం ప్రభావం తగ్గడమే కాకుండా కొన్ని సందర్భాల్లో హానికరంగా కూడా మారే అవకాశం ఉంటుంది.
ఓఆర్ఎస్ పొడి రూపంలోనే కాకుండా నేరుగా తాగేందుకు సిద్ధంగా ఉన్న ద్రావణం రూపంలో కూడా లభిస్తుంది. సిద్ధంగా లభించే ఓఆర్ఎస్లో తయారీకి సంబంధించిన పొరపాట్లకు అవకాశం ఉండదు. అలాగే నీటి కలుషితంపై ఆందోళన కూడా తక్కువగా ఉంటుంది. తయారు చేయాల్సిన అవసరం లేకపోవడంతో ఇది సౌకర్యవంతంగా ఉండడంతోపాటు రుచి మెరుగ్గా ఉండటం వల్ల కొందరు సులభంగా తీసుకునే అవకాశం ఉంటుంది. పొడి రూపంలోని ఓఆర్ఎస్ ఉపయోగించినప్పుడు మాత్రం ప్యాకెట్‌పై సూచించిన విధానాన్ని కచ్చితంగా పాటించడం చాలా ముఖ్యం. ఓఆర్ఎస్ తయారీలో అత్యంత సాధారణంగా జరిగే పొరపాటు నీటి పరిమాణాన్ని తప్పుగా కలపడం. సూచించిన దానికంటే తక్కువ నీటిని కలిపితే ద్రావణం మరీ గాఢంగా మారుతుంది. దాంతో శరీరంలోకి అధిక మొత్తంలో లవణాలు వెళ్లి డీహైడ్రేషన్ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎక్కువ నీటిని కలిపితే ద్రావణం పలుచబడిపోయి శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తగినంతగా భర్తీ చేయలేకపోతుంది. అందువల్ల ఓఆర్ఎస్ ప్యాకెట్‌పై సూచించిన కచ్చితమైన పరిమాణంలోనే శుభ్రమైన, సురక్షితమైన తాగునీటిలో కలపాలి. నీటి భద్రతపై అనుమానం ఉంటే నీటిని మరిగించి చల్లార్చిన తర్వాత ఉపయోగించడం మంచిది.
ఒక ప్యాకెట్ ఓఆర్ఎస్ పొడిని సగానికి విభజించి వాడటం కూడా సరైన పద్ధతి కాదు. చిన్న పరిమాణంలో నీటికి ప్రత్యేకంగా తయారు చేసిన సింగిల్ యూజ్ ప్యాకెట్లు ఉంటే మాత్రమే వాటిని సూచించిన పరిమాణంలో ఉపయోగించాలి. సాధారణంగా ప్రతి ప్యాకెట్ ఒక నిర్దిష్ట పరిమాణంలో నీటిలో కలపడానికి తయారవుతుంది. అందులో కొంత పొడిని మాత్రమే తీసుకుని మిగతాదాన్ని తర్వాత ఉపయోగించడం వల్ల పదార్థాల నిష్పత్తి మారే అవకాశం ఉంటుంది. భారతీయ వినియోగదారులు పొడి ఓఆర్ఎస్ను తయారు చేసే విధానంపై నిర్వహించిన అధ్యయనాలు కూడా నీటి పరిమాణాన్ని సరిగ్గా కొలవకపోవడం, రుచికి అనుగుణంగా తయారు చేయడం వంటి కారణాలతో ద్రావణంలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు సూచించాయి. ఓఆర్ఎస్ను ఒకేసారి ఎక్కువ మొత్తంలో తాగించడం కంటే కొద్దికొద్దిగా, తరచూ ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు లేదా వాంతులు అవుతున్నవారికి చిన్న చిన్న మోతాదుల్లో ఇవ్వడం మంచిది. ఓఆర్ఎస్ తాగిన వెంటనే వాంతి వచ్చినా పూర్తిగా ఆపేయాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు విరామం ఇచ్చి, ఆ తర్వాత మరింత తక్కువ పరిమాణంలో మళ్లీ ఇవ్వవచ్చు. విరేచనాల వల్ల నిరంతరం కోల్పోతున్న నీరు, ఎలక్ట్రోలైట్లను క్రమంగా భర్తీ చేయడమే దీని ఉద్దేశం. పిల్లలకు ఒక టీస్పూన్ లేదా కప్పుతో తరచూ ఇవ్వవచ్చు. అయితే అవసరమైన ఓఆర్ఎస్ పరిమాణం వయసు, విరేచనాల సంఖ్య, మల విసర్జన పరిమాణం, డీహైడ్రేషన్ తీవ్రతను బట్టి మారుతుంది.
తయారు చేసిన ఓఆర్ఎస్ను ఎక్కువ కాలం నిల్వ ఉంచి తాగడం కూడా సరైన పద్ధతి కాదు. ద్రావణాన్ని మూతపెట్టి ఉంచి 24 గంటల్లోపు వినియోగించాలి. ఆ తర్వాత మిగిలిన ద్రావణాన్ని పారబోసి కొత్తగా తయారు చేసుకోవాలి. ఎక్కువ సమయం నిల్వ ఉంచిన ఓఆర్ఎస్లో బ్యాక్టీరియా కలుషితం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. దాంతో దాని భద్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది. విరేచనాల సమయంలో సరైన పద్ధతిలో ఓఆర్ఎస్ తీసుకోవడం డీహైడ్రేషన్‌ను నివారించడంలో, చికిత్స చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో ఇంటి వద్ద ఓఆర్ఎస్ ఇవ్వడం మాత్రమే సరిపోదు. తీవ్రమైన దాహం, పదేపదే వాంతులు, మలంలో రక్తం లేదా శ్లేష్మం కనిపించడం, కళ్లు లోపలికి వెళ్లినట్లు కనిపించడం, అధిక జ్వరం, ద్రవాలు తాగలేకపోవడం, మూత్రం తగ్గిపోవడం, అసాధారణంగా నిద్రమత్తుగా ఉండడం లేదా చిరాకు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సరైన సంరక్షణ ఉన్నప్పటికీ విరేచనాలు కొనసాగుతున్నా వైద్య పరీక్ష అవసరమవుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో డీహైడ్రేషన్ త్వరగా తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున మరింత జాగ్రత్త అవసరం. విరేచనాల సమయంలో ఓఆర్ఎస్ ఇవ్వడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన పరిమాణంలో తయారు చేయడం, సరైన విధంగా ఇవ్వడం, సమయానికి వినియోగించడం కూడా అంతే ముఖ్యం. ఈ చిన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా డీహైడ్రేషన్ ముప్పును తగ్గించి, ఆరోగ్యం మరింత క్షీణించకుండా కాపాడుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.