Argentina Sea : అర్జెంటీనా (Argentina Sea ) లో రాత్రికి రాత్రే సముద్రం (Sea) వెనక్కి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, కేవలం ఒక తాత్కాలిక సహజ ప్రక్రియ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అర్జెంటీనాలోని మార్ డెల్ ప్లాటా తీరంలో అట్లాంటిక్ మహాసముద్రం (Atlantic Ocean) నీరు సుమారు 23 కిలోమీటర్ల మేర వెనక్కి తగ్గినట్టు వార్తలు వచ్చాయి.
సముద్రం వెనక్కి తగ్గడంవల్ల, సాధారణంగా నీటిలో మునిగి ఉండే ‘రెస్టింగా డెల్ ఫారో’ అనే భారీ శిలా ప్రదేశం పూర్తిగా బయటపడింది. తీరంలో నిలిచిపోయిన పడవలు, వెనక్కి వెళ్ళిన సముద్రగర్భం దృశ్యాలను చూసి స్థానికులు, పర్యాటకులు విస్మయానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, సముద్రం ఎండిపోయిందనే తప్పుడు ప్రచారం జోరందుకుంది.
అయితే ఇది సునామీ హెచ్చరికగానీ, సముద్రం శాశ్వతంగా ఎండిపోవడంగానీ కాదని నిపుణులు తేల్చిచెప్పారు. తీరం నుంచి సముద్రం వైపు బలమైన గాలులు వీయడం, అదే సమయంలో సముద్రపు పోటు తక్కువగా ఉండటంవల్ల నీరు తాత్కాలికంగా వెనక్కి వెళ్లిందని వివరించారు. కొన్ని గంటల వ్యవధిలోనే నీటిమట్టం తిరిగి సాధారణ స్థాయికి చేరుకుందని అర్జెంటీనా మీడియా వెల్లడించింది. సాధారణంగా భూకంపం సంభవించినప్పుడు నీరు వేగంగా వెనక్కి వెళ్లి, తిరిగి భారీ అలలతో విరుచుకుపడితే దానిని సునామీగా పరిగణిస్తారు.
కానీ ఇక్కడ కేవలం వాతావరణ మార్పులవల్లే నీరు వెనక్కి వెళ్లి, అనంతరం తిరిగి ప్రశాంతంగా యథాస్థితికి చేరుకుంది. కాబట్టి సముద్రం అదృశ్యమైందంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని నిపుణులు స్పష్టంచేశారు.