న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ప్రపంచవ్యాప్త ఉత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో భారత్‌కు చెందిన నాలుగు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వరల్డ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్- 2025 తాజాగా విడుదలయ్యాయి. అయితే ఇందులో స్థానం పొందిన నాలుగు భారత యూనివర్సిటీల ర్యాంకులు గత ఏడాది కన్నా దిగజారడం గమనార్హం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరు, 2023లో 101-125 ర్యాంకింగ్ పొందగా, ఇప్పుడది దిగజారి 201-300 శ్రేణికి చేరుకుంది. అదే స్థాయి ర్యాంకింగ్ పొందిన ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్‌లకు కూడా గతంలో కన్నా ర్యాంకింగ్ తగ్గింది.
ఇక 2023లో 151-175 శ్రేణిలో ర్యాంక్ పొందిన ఐఐటీ- బాంబే ఈసారి జాబితాలోనే స్థానం కోల్పోయింది. ఈసారి ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో కొత్తగా శిక్ష ఓ అనుసంధాన్ చోటు దక్కించుకుంది. దీనికి 201-300 శ్రేణి ర్యాంకింగ్ దక్కింది. ఈ సంస్థ ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ప్రైవేట్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ర్యాంకుల ప్రకారం భారత్‌లో ఐఐఎస్సీ బెంగళూరు మొదటి, ఐఐటీ ఢిల్లీ రెండు, ఐఐటీ మద్రాస్ మూడు, శిక్ష ఓ అనుసంధాన్ నాలుగో ర్యాంకు పొందాయి. ఇక అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ఈ ఏడాది కూడా మొదటి ర్యాంకును నిలబెట్టుకుంది.