Corona Virus | కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న వైరస్ మరోసారి విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ కారణంగా మరోసారి కొవిడ్ ముప్పు పొంచిఉండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరస్.. భారత్‌లోనూ వెలుగుచూసింది. గత వారం గుజరాత్లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వేరియంట్ బయటపడింది. తాజాగా బీహార్‌లో నలుగురు విదేశీయులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలడం కలవరానికి గురి చేస్తోంది.
బీహార్‌లోని గయ విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో విదేశాల నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులకు పాజిటివ్‌గా తేలింది. వారిలో ఒకరు మయన్మార్ నుంచి రాగా, మరొకరు థాయ్‌లాండ్, ఇద్దరు ఇంగ్లాండ్ నుంచి వచ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు. పాజిటివ్ తేలిన వారిని గయలోని ఓ హోటల్లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు గయ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రంజన్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగానే ఉన్నారని.. వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఐసోలేషన్‌లో ఉంచి తగిన ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు వివరించారు.
మరోవైపు ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వేరియంట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ నూతన మార్గదర్శకాలను విడుదల చేసి అన్ని రాష్ట్రాలను ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇతర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ తేలిన వారిని వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు.