Chennai | తమిళనాడు రాజధాని చెన్నై మెరీనా బీచ్‌లో నిర్వహించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకున్నది. పెద్ద ఎత్తున ఎయిర్ షోకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకున్నది. దాంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 230 మందికి గాయపడ్డారు. క్షతగాత్రులకు మూడు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను శ్రీనివాసన్ (48), కార్తికేయన్ (34), జాన్ బాబు (56), దినేష్‌గా గుర్తించారు. ఐఏఎఫ్ 92 వార్షికోత్సవం సందర్భంగా ఎయిర్‌షోని ఏర్పాటు చేసింది. దాదాపు 13లక్షల మందికిపైగా జనం రైలు, మెట్రో, కార్లు, బస్సుల ద్వారా మెరీనా బీచ్‌కు చేరుకున్నారు. భారీగా జనం వచ్చిన నేపథ్యంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ నమోదు చేశారు. ఎయిర్ షో ముగిసిన తర్వాత సందర్శకులు తిరిగి వెళ్తున్న సమయంలో పరిస్థితి అదుపు తప్పింది. భారీగా జనం తరలిరావడం, ఉక్కపోతతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు.
తీవ్ర రద్దీతో పలువురు కిందపడిపోయారు. దాంతో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయాలకు గురయ్యారు. లక్షలాది మంది తరలిరావడంతో వారిని అదుపు చేయడంతో ట్రాఫిక్ అధికారులు నియంత్రించలేకపోయారు. మెరీనా బీచ్‌లోని ముఖ్యమైన విస్తీర్ణంలో ఉన్న కామరాజ్ సలైలోని మద్రాస్ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి పలువురు వెళ్లడంతో రద్దీ స్వల్పంగా తగ్గింది. అయితే, ఎయిర్ షో కోసం చెన్నైలోని మెరీనా బీచ్‌లో కనీసం 10 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి బీచ్‌కు జనం రావడం మొదలై.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ ఒకేసారి వెళ్లిపోవడం గందరగోళానికి దారి తీసిందని ఓ అధికారి తెలిపారు. దాదాపు 21 సంవత్సరాల తర్వాత చెన్నైలో ఎయిర్ షో నిర్వహించారు.
కార్యక్రమానికి వైమానిక దళం, తమిళనాడు అధికారులు విస్తృత ప్రచారం కల్పించారు. పెద్ద ఎత్తున జనం తరలిరావడం.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయకపోవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు. చాలామంది డీహైడ్రేషన్ బారినపడ్డారు. తాగేందుకు కనీసం నీళ్లు కూడా అందుబాటు లేవని.. నీటి కోసం కూడా వెళ్లలేకపోయినట్లు పలువురు పేర్కొన్నారు. మరో వైపు చెన్నైలో పగటిపూట దాదాపు 36డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో వైపు మెట్రోల్లోనూ రద్దీ కనిపించింది. గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్, చింతాద్రిపేట ఎంఆర్టీఎస్ స్టేషన్ తదితర రైల్వేస్టేషన్లలో రద్దీతో జనం ఇబ్బందులకు గురయ్యారు.