న్యూఢిల్లీ, జూన్ 7: మోదీ సర్కారు హయాంలో వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత్ ర్యాంకులు దిగజారుతున్నాయి. తాజాగా పర్యావరణ పరిరక్షణ పనితీరు సూచీ(ఎన్విరాన్మెంటల్ పెర్ఫామెన్స్ ఇండెక్స్-ఈపీఐ)లో భారత్ అట్టడగున నిలిచింది. 180 దేశాలపై చేసిన సర్వేలో మనదేశం చివరి స్థానంలో ఉన్నది. 2020(168), 2021(177) కంటే భారత్ స్థానం మరింత దిగజారింది. అమెరికాలోని యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, కొలంబియా వర్సిటీ విడుదల చేసిన ఈ సూచీలో డెన్మార్క్ అగ్రస్థానంలో ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించిన యూకే, ఫిన్లాండ్ వరుసగా రెండు, మూడు స్థానాలు సాధించాయి.
40 పనితీరు సూచీల ఆధారంగా..
వాతావరణ మార్పులు సహా 11 క్యాటగిరీల్లో 40 పనితీరు సూచీల ఆధారంగా 180 దేశాలకు ఈపీఐ ర్యాంకులు ఇచ్చారు. ఈ సూచీలు ఆయా దేశాలు పర్యావరణ పరిరక్షణకు నిర్దేశించుకున్న లక్ష్యాలకు ఎంతమేరకు దగ్గరగా ఉన్నాయో అంచనాలను అందిస్తాయి. ఇందులో భారత్ అతితక్కువగా 18.9 సాధించింది. మయన్మార్(19.4), వియత్నాం(20.1), బంగ్లాదేశ్(23.1), పాకిస్థాన్(24.6) మెరుగైన స్థాయి లో ఉన్నాయి. భారత్లో వాయునాణ్యత ప్రమాదకరస్థాయికి పెరుగుతున్నదని, కర్బన ఉద్గారాల విడుదల ఎక్కువ అవుతున్నదని పేర్కొన్నది. 2050లో ప్రపంచంలో కర్బన ఉద్గారాల విడుదలో చైనా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉంటాయని పరిశోధకులు తెలిపారు.
