Venkaiah Naidu : భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai) పై దాడిని మాజీ ఉపరాష్ట్రపతి (Former vice president) వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఖండించారు. జస్టిస్ గవాయ్‌పై బూటుతో దాడి చేసేందుకు యత్నించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం జస్టిస్ గవాయ్‌కి సంబంధిచిన వ్యక్తిగత అంశం కాదని, సమాజానికి, వ్యవస్థకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు.
కాగా, సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా సీజేఐ జస్టిస్ గవాయ్‌పై రాకేశ్ కిషోర్ అనే న్యాయవాది బూట్ విసిరేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుని, బయటకు పంపించారు. అదేవిధంగా రాకేశ్ కిశోర్‌ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. ఘటనపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది.
న్యాయవాదుల కేసుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని బార్ అండ్ బెంచ్ వెబ్సైట్లో పేర్కొన్నారు. రాకేశ్ జడ్జి క్యాబిన్ వైపు వెళ్లి తన బూటును తీసి సీజేఐపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకుని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లారు. తీసుకెళ్తుండగా ఆ న్యాయవాది ‘సనాతన ధర్మానికి అవమానాన్ని సహించం’ అని అరిచినట్టు సమాచారం.
ఈ సందర్భంగా సీజేఐ గవాయ్ చలించకుండా వాదనలు కొనసాగించాలని న్యాయవాదులను కోరారు. ‘ఇలాంటి వాటితో కలవరపడకండి. నేను కలవరపడలేదు. ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు’ అని గవాయ్ వ్యాఖ్యానించారు. ఘటనపై కోర్టు భద్రతా యూనిట్ విచారణ ప్రారంభించింది. కాగా, దాడికి యత్నించిన లాయర్ ఉద్దేశం ఏమిటో తెలియలేదు.
అయితే ఇటీవల ఖజురహోలో విష్ణుమూర్తి విగ్రహం పునఃస్థాపనకు సంబంధించిన కేసులో సీజేఐ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. ఆ కేసును కొట్టేస్తూ.. ‘వెళ్లి ఆ దేవుడినే ఏదైనా చేయమని అడగండి. మీరు విష్ణు దేవుడికి పరమ భక్తుడినని చెప్తున్నారు కదా. కాబట్టి వెళ్లి ప్రార్థించండి. అది పురావస్తు శాఖ స్థలం. పురావస్తు శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.
సీజేఐ మత విశ్వాసాలను దెబ్బతీశారని సోషల్ మీడియాలో చాలా మంది విమర్శించారు. అయితే ఆ తర్వాత ఈ అంశంపై సీజేఐ స్పష్టతనిస్తూ.. తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. ఇదిలావుంటే సీజేఐపై దాడిని న్యాయవాదుల సంఘాలు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు ఖండించారు.