న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ప్రాజెక్టు చీతాను చేపట్టింది కేంద్రంలోని బీజేపీ సర్కారు కాదా? 2009లోనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందా? చీతాలను భారత్‌కు రప్పించటానికి అనేక వన్యప్రాణి సంస్థలు కృషి చేశాయా? ఆ క్రెడిట్‌ను ప్రధాని మోదీ కొట్టేయాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రపంచంలోనే తొలి అంతర్ ఖండాంతర వన్యప్రాణి ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టు.. ప్రాజెక్టు చీతా. నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలు శనివారం మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో చేరాయి. ఇదొక చారిత్రక క్షణమని, ఇంతకుముందు ప్రభుత్వాలు చీతాల జాతి పునరుద్ధరణకు ప్రయత్నించలేదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే.. ఈ ప్రాజెక్టును 2009లోనే అప్పటి ప్రభుత్వం చేపట్టిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కుండబద్ధలు కొట్టారు.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2009-20లో ప్రారంభమైంది. ఆఫ్రికన్ చీతాలను భారత్‌కు రప్పించేందుకు వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ), ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీఐ) తీవ్రంగా కృషి చేశాయి. 2009లో డబ్ల్యూటీఐకి చెందిన డాక్టర్ ఎంకే రంజిత్‌సింగ్ దీనికోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారు. చీతాలను తీసుకొచ్చేందుకు దక్షిణాఫ్రికా, నమీబియాలో పర్యటించారు. ఈ విషయాలను జైరాం రమేశ్ ఆధారాలతో సహా బయటపెట్టారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన.. ప్రాజెక్టు చీతా కోసం డబ్ల్యూటీఐకు 2009లో అప్పటి ప్రభుత్వం రాసిన లేఖను బయటపెట్టారు. ఆ సమయంలోనే పర్యావరణం, అడవుల శాఖ మంత్రిగా ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్టు వెల్లడించారు. లేఖలో.. చీతాలను ఉంచటానికి తగిన ప్రదేశాలను తెలియజేయాలని, ఇందుకోసం ఇతర వన్యప్రాణి సంస్థలతో సమన్వయం చేసుకోవాలని రంజిత్‌సింగ్‌కు జైరాం రమేశ్ సూచించారు. ఈ అధ్యయనంలో రాష్ట్ర అటవీశాఖలను కూడా భాగస్వామ్యం చేయవచ్చని తెలిపారు.
నెటిజన్ల మండిపాటు
ప్రాజెక్ట్ చీతాపై ప్రధాని మోదీ అబద్ధాలు చెప్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. 2009 లో చేపట్టిన ఈ ప్రాజెక్టును తామే చేపట్టినట్టు క్రెడిట్ కొట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఐఎన్ఎస్ విక్రాంత్ విషయంలోనూ అబద్ధాలు చెప్పారని విమర్శిస్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేస్తూ మోదీ, బీజేపీ తీరును ఎండగడుతున్నారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ విషయంలోనూ!
ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను ఈ నెల 2న ప్రధాని మోదీ ప్రారంభిస్తూ.. 21 శతాబ్ధపు భారతదేశ కృషి, ప్రతిభకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కానీ, ఈ ప్రాజెక్టు 1999లోనే రూపకల్పన జరిగింది. అప్పటి నుంచి డిజైన్, తయారీ, పరీక్షలు, ప్రారంభం అయ్యేసరికి 22 ఏండ్లు పట్టింది. అధికారంలో ఉండటం వల్లే ప్రధాని మోదీ ఈ యుద్ధ నౌకను ప్రారంభించారని, క్రెడిట్ కొట్టేస్తున్నారని పలువురు విశ్లేషకులు మోదీ తీరును విమర్శించారు.
అబద్ధాలతో క్రెడిట్ కొట్టేస్తున్న మోదీ!
ప్రాజెక్టు చీతాపై ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, అబద్ధాలతో క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని జైరాం రమేశ్ ఆరోపించారు. మోదీ అబద్ధాల రోగ లక్షణాలు కలిగిన వ్యక్తి అని చురక అంటించారు. భారత్ జోడో యాత్ర వల్ల శనివారం ఈ వివరాలను బయటపెట్టలేకపోయానని పేర్కొన్నారు.
ప్రాజెక్టు చీతాపై 2009లో వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అధికారి రంజిత్‌సింగ్‌కు అప్పటి కేంద్ర మంత్రి జైరాం రమేశ్ రాసిన లేఖ)