Girija Vyas | సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ గురువారం అహ్మదాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని నివాసంలో మార్చి 31న పూజ చేస్తున్న సమయంలో సమయంలో హారతి ఇస్తుండగా.. మంటలు అంటుకున్నాయి. దాంతో 90శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆమె అహ్మదాబాద్‌లోని జైడస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్‌లోని నివాసానికి పార్థీవదేహాన్ని తరలించనున్నట్లు తెలిపారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
గిరిజా వ్యాసా రాజకీయ, సామాజిక, విద్యారంగంలో విలువైన సేవలుందించారు. ఆమె జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గానూ పని చేశారు. పలుసార్లు లోక్‌సభలో ఎంపీగా ఎన్నికై.. కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పని చేశారు. విద్య, మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషి మరువలేనిది. డాక్టర్ వ్యాస్ మరణంతో కాంగ్రెస్ పార్టీలో విషాదం అలుముకున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, గోవింద్ సింగ్ పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ.. గిరిజా వ్యాస్ మరణం అందరికీ తీరని లోటన్నారు. విద్య, రాజకీయ, సామాజిక రంగంలో అపారమైన కృషి చేశారన్నారు. ఆమె మరణం అందరికీ షాక్ లాంటిదన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ మాట్లాడుతూ.. ఆమె మరణం కాంగ్రెస్‌కు తీరని లోటన్నారు. గిరిజా వ్యాస్ జీ మరణ వార్త చాలా బాధాకరమని ఆ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
గిరిజా వ్యాస్ 1946 జూలై 8న కృష్ణ శర్మ, జమునా దేవి వ్యాస్ దంపతులకు జన్మించారు. తత్వశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ఆమె ఉదయపూర్‌లోని మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయం, డెలావేర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. 1985లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె రాజస్థాన్‌లోని ఉదయపూర్ నుంచి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 1990 వరకు రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 1991లో ఉదయపూర్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో సమాచారశాఖ మంత్రిగా పని చేశారు. 1993లో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు. 1996లో 2వసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో లోక్‌సభకు మూడోసారి ఎన్నికయ్యారు. 2001 నుంచి 2004 వరకు ఆమె రాజస్థాన్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. 2005 ఫిబ్రవరిలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జాతీయ మహిళా కమిషన్ చైపర్సన్ పదవికి ఆమెను నామినేట్ చేసింది. ఆమె 2011 ఆగస్టు ఒకటి వరకు పదవిలో కొనసాగారు. ఆమె 2008లో రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2013లో గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిగా పని చేశారు.