బెంగళూరు: కర్ణాటక నేత, కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్ యత్నాల్ను (Basangouda Patil Yatnal) పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. పార్టీతోపాటు మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. బీజేపీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. కర్ణాటకలోని విజయపుర ఎమ్మెల్యే అయిన బసనగౌడ పాటిల్ యత్నాల్ గతంలో మాజీ సీఎం బీఎస్ యుడియూరప్పకు సన్నిహితుడిగా పేరుపొందారు. అయితే బసవరాజ్ బొమ్మై సీఎం అయిన తర్వాత యుడియూరప్ప, ఆయన కుమారుడ్ని బహిరంగంగా విమర్శించారు. పార్టీ రాష్ట్ర చీఫ్గా యడియూరప్ప కుమారుడిని ఎన్నుకోవడంపై బాహాటంగా ఆరోపణలు చేశారు. అలాగే నటి రన్యారావు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ అగ్ర నాయకత్వానికి ఆగ్రహం కలిగించాయి.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 18న బసనగౌడ పాటిల్ యత్నాల్కు బీజేపీ షోకాజ్ నోటీస్ పంపింది. ఆయన ప్రతిస్పందనను సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ పరిశీలించింది. ఈ నేపథ్యంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన ఆయనను ఆరేళ్లపాటు బీజేపీ నుంచి బహిష్కరించింది. బుధవారం ఈ మేరకు నోటీస్ జారీ చేసింది.
మరోవైపు బీజేపీ నుంచి తనను తొలగించడంపై బసనగౌడ పాటిల్ యత్నాల్ స్పందించారు.
వంశపర రాజకీయాలు, పార్టీలో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనకు శిక్ష విధించారని ఆరోపించారు. సంస్కరణలను సమర్థించడం, నిరంకుశ నాయకత్వాన్ని సవాల్, చేయడం, ఉత్తర కర్ణాటక అభివృద్ధిని కోరడం వంటి కారణాల వల్ల కొన్ని శక్తులు తనను లక్ష్యంగా చేసుకున్నాయని మండిపడ్డారు. బీజేపీ నుంచి తనను బహిష్కరించినప్పటికీ వీటిపై తన పోరాటాన్ని అడ్డుకోలేరని అన్నారు.