న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: అవినీతి నిరోధక అంబుడ్స్‌మెన్ ‘లోక్‌పాల్’ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నియమితులయ్యారు. లోక్‌పాల్ చీఫ్, సభ్యుల ఎంపికపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. జస్టిస్ ఖాన్విల్కర్ సుప్రీంకోర్టు జడ్జిగా 2022 జూలైలో రిటైర్ అయ్యారు.
రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రితురాజ్ అవస్తీ.. జ్యుడిషియల్ సభ్యులుగా, సుశీల్ చంద్ర, పంకజ్‌కుమార్, అజయ్ టిర్కీ నాన్-జ్యుడిషియల్ సభ్యులుగా నియమితులయ్యారు. లోక్‌పాల్ చీఫ్‌గా జస్టిస్ పినాకి చంద్రఘోష్ పదవీకాలం 2022 మే 27న ముగిసిన తర్వాత.. రెండేండ్లుగా చైర్పర్సన్ పదవి ఖాళీగా ఉండిపోయింది. ఇంతకాలం తాత్కాలిక చైర్‌పర్సన్‌గా లోక్‌పాల్ సభ్యులు జస్టిస్ ప్రదీప్ కుమార్ మెహంతీ కొనసాగారు.