(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు రంగానికి కొత్త జవసత్వాలు తెస్తామంటూ గప్పాలు కొట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఆ రంగాన్ని దొంగదెబ్బతీస్తున్నది. విద్యుత్తు పంపిణీ సంస్థలపై కత్తిగట్టిన కేంద్రం.. డిస్కంలకు వస్తున్న నష్టాలను పూడ్చకుండా ఆ భారాన్ని ప్రజలమీద మోపడానికి కుట్రకు తెరతీసింది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిస్కంల నష్టాల్లో సగం మొత్తాన్ని ప్రజల నుంచి వసూలు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ తీవ్రంగా వ్యతిరేకించారు. డిస్కంల నష్టాలను భరించాల్సింది కేంద్రమే గానీ, వినియోగదారులు కాదని ఆయన తేల్చిచెప్పారు. కేంద్రప్రభుత్వం పెడుతున్న నిబంధనలే డిస్కంల నష్టాలకు కారణమని ధ్వజమెత్తారు. కేంద్రం చర్యను ఏకపక్షపూరితమైనదిగా అభివర్ణించారు. ఈ మేరకు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులకు లేఖ రాశాలు.