న్యూఢిల్లీ, మే 28: ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా, రాకపోయినా భారత్.. తన ఆర్థిక విధానాలను ఇలాగే కొనసాగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ‘బ్లూంబర్గ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత విధానాల్లో కొనసాగింపు ఉంటుందని, ఏ ప్రభుత్వం వచ్చినా వీటిని కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బడ్జెట్ను ప్రకటిస్తుందని, ప్రస్తుతం అమలులో ఉన్న మంచి అంశాలను కొనసాగిస్తూనే ఇంకా ఏమైనా మార్పులు చేసేందుకు ప్రయత్నించడంపై దృష్టి పెట్టవచ్చని ఆయన తెలిపారు. భారత్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన భారీ లోటుపాట్లు ఉన్నందున, ఇక మీదట కూడా మౌలిక వసతుల నాణ్యతపై దేశం దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పెట్టుబడి కేవలం కొన్ని ప్రధాన పారిశ్రామిక సంస్థలకు లాభం చేకూర్చేలా మాత్రమే ఉండొద్దని అన్నారు.