న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి ఉన్నపళంగా తన సోదరి షేక్ రెహానాతో కలిసి భారత్కు వచ్చిన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా లండన్ వెళ్లాలని భావిస్తున్నారు. రెహానా కూతురు తులిప్ సిద్దిఖ్ బ్రిటన్ పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. అయితే, హసీనాకు ఆశ్రయం కల్పించేందుకు యూకే ఆసక్తి చూపించడం లేదు. ఆశ్రయం కోరేందుకు, తాత్కాలిక శరణార్థిగా యూకేకు ప్రయాణించేందుకు అనుమతించే నిబంధన తమ దేశంలో లేదని యూకే హోం కార్యాలయ అధికార ప్రతినిధి చెప్పారు. అంతర్జాతీయ రక్షణ కోరేవారు ముందుగా ఏ సురక్షిత దేశానికి అయితే చేరుకున్నారో ఆ దేశాన్నే ఆశ్రయం కోరాలని తెలిపారు. బంగ్లాదేశ్లో జరిగిన హింసపై విచారణ జరిపితే, తమ దేశంలో హసీనాకు న్యాయపరంగా ఎలాంటి రక్షణ ఉండబోదని యూకే ప్రభుత్వం పరోక్షంగా చెప్పింది. దీంతో లండన్ వెళ్లాలనే నిర్ణయాన్ని హసీనా వాయిదా వేసుకునే అవకాశం ఉందని, కొన్ని రోజుల పాటు ఆమె భారత్లోనే ఉండే అవకాశం ఉంది.